Skip to main content

మార్గం చూపిన మొసలి

మించలవారికోట గ్రామానికి చివరలో ఒక చెరువు ఉండేది. చెరువు గట్టున గణేష్ వాళ్ళు రోజూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజున వాడు బంతినొకదాన్ని తీసుకొని వెళ్ళాడు అక్కడికి. ఆ సమయానికి మిగిలిన పిల్లలెవ్వరూ రాలేదు ఇంకా. వాడొక్కడే అలా బంతితో ఆడుతుంటే, అది కాస్తా వెళ్ళి చెరువులో ఎక్కడో పడిపోయింది.
గణేశ్ కు ఈత వచ్చు కదా, అందుకని బంతిని వెతుక్కుంటూ చెరువులోకి దిగాడు. అంతలో వాడికి దగ్గర్లో ఏదో కదులుతున్న అలికిడి వినబడింది. ఏంటా అని చూస్తే అది ఒక మొసలి! వలలో చిక్కుకుని గిలగిల కొట్టుకుంటోంది, ఆగి ఆగి.
గణేశ్‌ పారిపోదామనుకున్నాడు. కానీ 'అది వలలో‌ చిక్కుకొని ఉన్నది కదా, భయపడేదేముందిలే' అని, దానికి దగ్గరగా వెళ్ళాడు, బురదలో నడుస్తూ.
గణేశ్‌ను చూడగానే మొసలి బాధతోటీ సంతోషంతోటీ కన్నీళ్ళు కార్చింది. 'కాపాడు కాపాడు' అని మొరపెట్టుకున్నది. 'నన్ను రక్షించు, ప్లీజ్' అని వేడుకున్నది.
గణేశ్‌కి కొంచెం భయం వేసింది. అయినా 'అది అంతగా వేడుకుంటున్నది గదా' అని జాలికూడా వేసింది. 'నువ్వు కౄరమృగానివి కదా! నిన్ను వలలోంచి విడిపించగానే నన్ను పట్టుకొని తినేస్తావేమో?' అన్నాడు.
'అయ్యో, నా సంగతి నీకు తెలీదు. నా కన్నీళ్లను చూడు- అబద్ధాలు చెప్పే స్థితిలో ఉన్నానా? మేలు చేసిన వారికి కీడు చేస్తానా?' అని నమ్మ బలికింది మొసలి.
గణేశ్‌కి ఏం చెయ్యాలో తోచలేదు. 'పాపం, మంచి మొసలి' అనుకున్నాడు. దగ్గర్లో ఉన్న రాళ్ళు రెండింటిని తెచ్చి, ఆ రాళ్ళ మధ్యలో వల త్రాళ్ళను పెడుతూ వాటిని ఒక్కటొక్కటిగా తెగకొట్టాడు. అలా వాడు సగం వలను కోశాడో, లేదో- మొసలి తల బయటికి వచ్చింది. మరుక్షణంలో అది కాస్తా నోరు తెరచి వాడి కాలును పట్టేసుకున్నది!
'మాట తప్పుతావా? మోసం చేస్తావా? నేను నిన్ను విడిపిస్తున్నానే, నీకు అంత సాయం చేస్తున్నవాడిని మోసగించాల్సినంత అవసరం ఏమొచ్చింది?' అన్నాడు గణేష్, పెనుగులాడుతూ.


'ప్రపంచమే అంత! నా సహజగుణాన్ని నేనెలా వదులుతాననుకున్నావు?' అంది మొసలి- ప్రశాంతంగా, మరింతగా పట్టు బిగిస్తూ. 'పొరపాటు చేశానే' అని గణేష్ చాలా బాధపడ్డాడు. ఎవరైనా సాయం వస్తారేమో అని చూస్తే ఆ దారిన ఎవ్వరూ రావడంలేదు. మిగతా స్నేహితులంతా ఎప్పుడు వస్తారో తెలీలేదు. వచ్చినా వాళ్ళు మొసలిని ఎదిరించి ఏమి చేయగలరు? 'వల వేసిన పెద్దమనిషి ఎవరో వస్తే బాగుండు' అనుకున్నాడు. మొసలి చేసిన మోసాన్ని భరించలేక-పోతున్నాడు.
అంతలో చెట్టుమీద ఉన్న పక్షులు కిలకిలలాడాయి. గణేశ్ వాటికి తనగోడు వెళ్ళబోసుకున్నాడు. వాడి బాధని చూసి పక్షులూ జాలి పడ్డాయి. 'మేం ఈ మారుమూలన గూళ్ళు కట్టుకుని గుడ్లు పెడుతున్నాం, ఇక్కడకూడా మమ్మల్ని వదలట్లేదు పాడు పాము. వచ్చి మా కళ్ళముందే మా గుడ్లన్నిటినీ తింటోంది. ఈ ప్రపంచం తీరే అంత. ఎక్కడ చూసినా దుర్మార్గులే ఉన్నారు. ఆ దుర్మార్గులు మారరు- వాళ్ళ స్వభావమే అంత' అన్నాయవి.
అటుగా పరుగెడుతున్న కుందేలొకటి వీళ్ళ మాటలు విని ఆగింది. గణేశ్ దానికీ చెప్పుకున్నాడు తన బాధను. అంతావిన్నాక కుందేలు 'చాలా అన్యాయం' అంది. మొసలితో వాదనకు దిగింది. దాన్ని మాటల్లో‌ పెట్టి నోరు తెరిచేలా చేస్తే గణేశ్ బయటపడతాడు అనుకున్నది.
మొసలి ఒకవైపున గణేశ్ కాలును పట్టుకొని, పళ్ళ సందుల్లోంచే కుందేలుతో మాట్లాడటం మొదలుపెట్టింది.
"నీ మాటలు నాకు అస్సలు అర్థంకావటం లేదు. కొంచెం వీడి కాలును వదిలి మాట్లాడు" అంది కుందేలు.
'వాడిని విడిపించుదామని తెలివిగా అలా అంటున్నావా, నీ సంగతి నాకు తెలుసులే' అంది మొసలి.
'అయినా వీడు ఎక్కడ తప్పించుకుంటాడు? ఒంటికాలితో ఒక్క కుంటు కుంటేసరికి నీ తోకతో నువ్వు వాడిని పది దెబ్బలు కొడతావు- నీదేముంది? ఎలాగైనా వీడు నీ‌ పంట చిక్కిన ఆహారమే!' నవ్విందికుందేలు, మొసలిని ఉబ్బిస్తూ.
ఆ మాటలకు కొంచెం బోల్తాపడింది మొసలి. కాలును వదులు చేసింది; కానీ పూర్తిగా వదల్లేదు.
అంతలో పైనున్న పక్షుల గుంపు మొత్తం వచ్చిపడింది మొసలి మీద. కొన్ని దాని కళ్ళను పొడిచాయి. వీపును రక్కాయి కొన్ని. మరికొన్నేమో దాని కాళ్ళను గీకాయి. మొసలి అటూ ఇటూ‌ పొర్లింది. దాని క్రింద పడి కొన్ని పిట్టలు పాపం‌ నలిగిపోయాయి కూడా. అయినా పక్షులు దాన్ని వదలలేదు.
దాడిని కొనసాగించాయి. ఆ హడావిడిలో మొసలి నోరు విడివడింది. గణేశ్ ఒక్క గెంతులో‌ చెరువు గట్టెక్కి కూర్చున్నాడు. మరు నిముషంలో పిట్టలన్నీ‌ మొసలిని వదిలేసి చెట్టుమీదికి ఎగిరిపోయాయి.
'ఈ దుర్మార్గుల స్వభావమే అంత. మంచిగా చెబితే వినరు వీళ్ళు' అన్నది కుందేలు చెరువు గట్టున కూర్చొని వగరుస్తూ.
'చాలా చాలా థాంక్స్, పిట్టలూ, నాకోసం మీరు అంత శ్రమపడ్డారు!' అన్నాడు గణేశ్, మనసారా పిట్టల్ని మెచ్చుకుంటూ.
'అందరూ చెయ్యి కలిపితే చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. ఈసారి రానియ్యి, పాముని! మేం ఏం చేస్తామో చూద్దువు!' అన్నదొక పిట్ట, చెట్టు మీది నుంచి.
'అవునవును. దుర్మార్గుల స్వభావాల గురించి మాట్లాడుకుంటూ ఇన్నాళ్ళూ‌ మేం మా బలాన్ని మర్చిపోయాం. ఇంత పెద్ద మొసలినే పారద్రోలిన మేము ఇక మీద ఆ చెత్త పాముకి భయపడేదేముంది?' అన్నాయి పిట్టలన్నీ, గట్టిగా, గొడవ గొడవగా అరుస్తూ.

Comments

Popular posts from this blog

ఆవు - పులి

కాకి దాహం....

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది. చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు. కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది. నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది. . . . “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక స్ట్రా వెతికి తాగేది”.

సింహము-ఎలుక

సింహము-ఎలుక అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది.  కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది. “నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది.  ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి. కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరికి తీసేసిం