అనగనగా ఒక ఊరు. ఆ ఊరి చుట్టూ చెట్టూ, చేమా, పొలమూ పుట్రా ఉన్నాయి. ఆ పొలాల మధ్యలోంచే వూళ్ళోకి వచ్చే పోయే దారి వుంది. ఆ దారి వేరే వూళ్ళకు పోయే దారులను కలుపుతుంది. అలా కలిసే కూడల్లో మనుషులు ఒకరికొకరు ఎదురవుతారు. పలకరించుకుంటారు. ఒకరి పొడ ఒకరికి గిట్టకపోతే ముఖాలు తిప్పుకొని ఎవరిదారిన వాళ్ళు పోతూ వుంటారు. అది మనుషుల కథ. మామూలు కథ. మరి మనుషులకు వేరే జీవులు ఎదురయితే ఏమవుతుందో, ఇదే ఇంకో కథ. అవాళ- మనిషి, పాము ఒకరికొకరు ఎదురయిపోయారు. 'అమ్మో విషప్పురుగు. దాని కోరల్లో విషం..' అని భయంతో ఆగిపోయాడు మనిషి. 'అమ్మో విషప్పురుగు. మనకు కోరల్లోనే విషం. మనుషులకు నిలువెల్లా విషమే..' అని భయంతో ఆగిపోయింది పాము. ఇద్దరూ అలాగే రెండు క్షణాలసేపు ఒకరివంక ఒకరు చూస్తూ వుండిపోయారు. మనిషి వెనక్కి తగ్గుదామనుకున్నాడు. అడుగు తీసి అడుగు వెనక్కి వేద్దామనుకున్నాడు. కానీ పాము వెంట పడితే..? వెంటపడి కాటేస్తే..?' ఆలోచనలతో ఆగిపోయాడు. పాముకూడా వెనక్కి తగ్గుదామనుకుంది. జరజరా వెనక్కి వెళ్ళిపోదామనే అనుకుంది. కానీ మనిషి వెంటపడితే..? వెంటపడి కొడితే..?' ఆలోచనలతో ఆగిపోయింది. 'నన్ను కాటెయ్యద్దు...