సింహపురి రాజ్యాన్ని కనక మహారాజు పరిపాలించేవాడు. ఆయన పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. ప్రజలందరూ సరిగ్గా పన్నులు చెల్లించేవాళ్ళు. దాంతో ఆయన కోశాగారం ఎల్లప్పుడూ ధనంతో నిండి ఉండేది. ఆ కోశాగారానికి సంరక్షకుడు సుబ్బన్న, ముసలివాడవుతున్నాడు. తన తరువాత కోశాగారపు బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలిగే యువకుడిని ఎంపిక చేయమని సుబ్బన్న రాజుగారికి మనవి చేసుకొన్నాడు. రాజుగారు కొంచెం ఆలోచనలో పడ్డారు. సుబ్బన్న సమర్థుడూ, విశ్వాసపాత్రుడున్నూ. తన తండ్రిగారి హయాం నుంచీ కోశాగార బాధ్యతలు నిర్వహిస్తున్న సుబ్బన్న బలంగా ఉన్నంత కాలమూ తనకు కోశాగారం గురించి ఆలోచించవలసిన పని పడలేదు. ఇప్పుడిక కొత్త వారిని వెతకటం తప్పని సరి. అందుకని రాజుగారు చాటింపు వేయించారు:"రాజుగారికి ఆంతరంగికుడు ఒకడు కావాలి. చదువూ, బలమూ, తెలివి తేటలూ, నిజాయితీ, దురలవాట్లు లేకుండా ఉండటం- ఇవీ అవసరాలు". ఇంకేముంది, రాజ్యంలోని యువకులు అందరూ పోటీపడ్డారు. ఆ పోటీలు అన్నింటిలోనూ ఉత్తములుగా ఎంపికైన నలుగురిని రాజుగారి సమక్షంలో నిలబెట్టారు రాజోద్యోగులు. మహారాజుగారు వారి దేహ దారుఢ్యాన్నీ, చదువునీ, తెలివితేటల్నీ పరిశీలించారు. అన్నింటిలోనూ ఎవరి...