ఒక ఊళ్లో ఓ పిసినారి పుల్లయ్య ఉండేవాడు. అతను ఎవ్వరికీ ఏదీ ఇచ్చేవాడు కాదు. ఎప్పుడూ 'ఎట్లా పైసలు మిగల బెట్టాలా' అనే ఆలోచించేవాడు. అతని పిసినారితనం చూసి ప్రజలంతా ఆశ్చర్యపోయేవాళ్ళు. అట్లాంటి పిసినారి పుల్లయ్య కూడా సంవత్సరానికి ఒకసారి పండగరోజున దేవుడికి ఒక టెంకాయ కొట్టేవాడు. ఒకసారి అట్లాంటి పండుగ వచ్చింది. టెంకాయ కావాలి. పుల్లయ్య తమ ఊళ్ళోని దుకాణానికి వెళ్ళి "టెంకాయ ఎంత?" అని అడిగాడు. "నాలుగు రూపాయలు" అన్నాడు దుకాణదారు. "మూడు రూపాయలకు ఇస్తావా?" అడిగాడు పుల్లయ్య. పుల్లయ్య తత్వం తెలిసిన దుకాణదారు నవ్వాడు. "మన ఊళ్ళో అంతటా నాలుగు రూపాయలేనయ్యా! ప్రక్క ఊర్లో మూడు రూపాయలకు దొరకచ్చు చూడు" అన్నాడు. పుల్లయ్యకు ఆ ఆలోచన నచ్చింది. తను నడుచుకుంటూ ప్రక్క ఊరికి వెళ్ళాడు- "టెంకాయ ఎంత?" అంటే అక్కడి దుకాణదారు "మూడు రూపాయలు" అన్నాడు. "రెండు రూపాయలకు ఇచ్చెయ్యరాదూ?" అన్నాడు పుల్లయ్య, అలవాటుగా. దుకాణంవాడు పుల్లయ్యకేసి వింతగా చూస్తూ-"ఆ ధరకి ఇక్కడ రాదు- మూడు ఊళ్ళ అవతల రామాపురంలో ఉంది ఆ రేటు" అన్నాడు. పుల్లయ్యకు డబ్బ...