Skip to main content

పిసినారి పుల్లయ్య

ఒక ఊళ్లో ఓ పిసినారి పుల్లయ్య ఉండేవాడు. అతను ఎవ్వరికీ ఏదీ ఇచ్చేవాడు కాదు. ఎప్పుడూ 'ఎట్లా పైసలు మిగల బెట్టాలా' అనే ఆలోచించేవాడు. అతని పిసినారితనం చూసి ప్రజలంతా ఆశ్చర్యపోయేవాళ్ళు.

అట్లాంటి పిసినారి పుల్లయ్య కూడా సంవత్సరానికి ఒకసారి పండగరోజున దేవుడికి ఒక టెంకాయ కొట్టేవాడు. ఒకసారి అట్లాంటి పండుగ వచ్చింది. టెంకాయ కావాలి. పుల్లయ్య తమ ఊళ్ళోని దుకాణానికి వెళ్ళి "టెంకాయ ఎంత?" అని అడిగాడు. "నాలుగు రూపాయలు" అన్నాడు దుకాణదారు.
"మూడు రూపాయలకు ఇస్తావా?" అడిగాడు పుల్లయ్య.

పుల్లయ్య తత్వం తెలిసిన దుకాణదారు నవ్వాడు. "మన ఊళ్ళో అంతటా నాలుగు రూపాయలేనయ్యా! ప్రక్క ఊర్లో మూడు రూపాయలకు దొరకచ్చు చూడు" అన్నాడు.

పుల్లయ్యకు ఆ ఆలోచన నచ్చింది. తను నడుచుకుంటూ ప్రక్క ఊరికి వెళ్ళాడు- "టెంకాయ ఎంత?" అంటే అక్కడి దుకాణదారు "మూడు రూపాయలు" అన్నాడు. "రెండు రూపాయలకు ఇచ్చెయ్యరాదూ?" అన్నాడు పుల్లయ్య, అలవాటుగా.



దుకాణంవాడు పుల్లయ్యకేసి వింతగా చూస్తూ-"ఆ ధరకి ఇక్కడ రాదు- మూడు ఊళ్ళ అవతల రామాపురంలో ఉంది ఆ రేటు" అన్నాడు. పుల్లయ్యకు డబ్బులు ఎక్కువ పెట్టేందుకు మనసు రాలేదు. రామాపురం బయలు దేరాడు.

తీరా రామాపురం చేరే సరికి మధ్యాహ్నం దాటింది. "రెండు రూపాయలకు ఒక టెంకాయ!" అరుస్తున్నారు అక్కడి వ్యాపారులు. పుల్లయ్య వాళ్ల దగ్గరికి వెళ్ళి- "ఒక రూపాయికి ఇవ్వరాదూ?" అని అడిగేశాడు.

"నువ్వెవరో పిసినారి పుల్లయ్యలాగే ఉన్నావే!? ఇంతకంటే‌ తక్కువ ధరకి కావాలంటే లక్ష్మీపురం తోటకి పోవాల్సిందే" అన్నారు వాళ్ళు.

పుల్లయ్య అక్కడి నదిని దాటి, సాయంత్రంకల్లా లక్ష్మీపురానికి పదికిలోమీటర్ల దూరంలో ఉన్న తోటకు చేరుకున్నాడు.

అతను అక్కడికి వెళ్ళేసరికి తోట యజమాని క్రింద నిలబడి ఉన్నాడు. పనివాళ్ళు చెట్లెక్కి కొబ్బరికాయలు కోసి, క్రింద కుప్ప చేస్తున్నారు.
"ఒక రూపాయికొక కొబ్బరికాయట కదా, మీ దగ్గర?" అడిగాడు పుల్లయ్య.

"అవును-మీకు ఎన్ని కావాలి?" అడిగాడు తోట యజమాని.

"ఊరికే ఇవ్వచ్చుకదా, ఒక కొబ్బరికాయకు ఒక రూపాయా, మరీ దురాశ కాకపోతే?!" అన్నాడు పుల్లయ్య.

"మీదే ఊరు?" అని అడిగి తెలుసుకుని, "మీ ఊళ్ళో పుల్లయ్యగారని ఎవరో ఉన్నారటనే?" అన్నాడు తోట యజమాని.

"నేనే ఆ పుల్లయ్యని!" అన్నాడు పుల్లయ్య, 'తన ఖ్యాతి ఇంత దూరం వ్యాపించిందే' అని సంతోషపడుతూ.

తోటయజమాని నవ్వాడు. "ఓహో మీరేనన్నమాట! మీఅంతటివారు శ్రమపడి ఇంత దూరం నడిచి వచ్చారు; అందులోనూ దేవుడికి అంటున్నారు; ఊరికే కావాలంటున్నారుగా, చెట్టెక్కి కోసుకోండి ఎన్ని కావాలంటే అన్ని! క్రిందివి కావాలంటే మటుకు రూపాయికొకటి!" అన్నాడు.

పుల్లయ్యకు చెట్టు ఎక్కటం రాదు. అలాగని రూపాయి ఇచ్చి కొబ్బరికాయ కొనుక్కునేందుకు మనసొప్పలేదు కూడాను. "చెట్టెక్కుతాను-ఆమాత్రం‌ నేర్చుకోలేనా?" అనుకున్నాడు.

చాలా శ్రమపడి, నిక్కుతూ నీల్గుతూ అంత పొడుగున్న కొబ్బరి చెట్టెక్కేశాడు పుల్లయ్య. ఆలోగా అతని కాళ్ళూ, చేతులూ గీసుకుపోయి రక్తం కారసాగింది. అయినా డబ్బు ఖర్చులేకుండా కొబ్బరి కాయ వచ్చేస్తుందన్న ఆశ అతన్ని చెట్టెక్కించింది.

చెట్టెక్కాక పుల్లయ్యకు అనిపించింది- "ఒక్క కాయే ఎందుకు? ఓ బస్తాడు కోసుకుంటే పోలేదూ?" అని.

అట్లా ఒక మూడు నాలుగు కాయలు కోసి పంచెలో వేసుకున్నాడు. ఆ హడావిడికో, మరి టెంకాయల బరువు మోయలేకనో, మరి- పుల్లయ్య పంచె కాస్తా జారిపోయింది!

అయినా పట్టువదలని పుల్లయ్య చేతులు వదిలి పైన ఉన్న కొబ్బరి కాయను పట్టుకోబోతూ, ఒక్కసారిగా క్రిందికి చూశాడు- ఎప్పుడూ ఎక్కనంత ఎత్తు! అంత ఎత్తునుండి చూసేసరికి ఒక్కసారిగా కళ్ళు తిరిగాయతనికి! అంత ఎత్తునుండి పట్టు తప్పి క్రిందపడిపోయిన పుల్లయ్యకు నడుం విరిగింది! అటుపైన డాక్టరు ఖర్చులు వంద రూపాయలు దాటాయి!

'గోటితో పోయేదానికి గొడ్డలి' అంటే ఇదేనేమో!

Comments

Popular posts from this blog

కాకి దాహం....

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది. చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు. కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది. నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది. . . . “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక స్ట్రా వెతికి తాగేది”.

సింహము-ఎలుక

సింహము-ఎలుక అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది.  కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది. “నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది.  ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి. కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరిక...

కోపం వచ్చిన కోతులు

అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. వృక్షం వాటికి గాలి, చలి, యెండా తగలకుండా కాపాడేది. ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడ గడ వణుకుతున్నయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము, మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసాయి. ఆకులను కొమ్మలను విరిచేసి ఛల్లా ఛెదురు చేసాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో యేడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి. రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి, అయ్యో అనుకున్నయి పక్షులన్ని. అనవసరంగా మనకు సంబంధంలేని విశయంలో తలదూర్చామని పశ్చ్యాతాప పడ్డాయి.