Skip to main content

విశాల హృదయం-విశాల రాజ్యం


--------------------------------
అనగా అనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు విశాల రాజ్యం. ఆరాజ్యానికి రాజు విశాలుడు. పేరుకు తగ్గట్లుగా ఆ రాజు హృదయం విశాలమైనది. రాజు రాజ్యాన్ని బాగా పరిపాలించేవాడు. ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. అందుకు తగిన విధంగానే ప్రజలు కూడా ఆయన పట్ల వినయ విధేతలు కలిగి ఉండేవాళ్లు. కష్టపడి పని చేసేవాళ్ళు.
రైతులందరితో పాటు రాజు కూడా వ్యవసాయం చేసేవాడు. మంచి మంచి పంటలు పండించేవాడు. రైతులందరికి పంటలు పండించడంలో మెళుకువలు చెప్పి, మంచి నాణ్యమైన పంటలు పండించేట్లు చూసేవాడు విశాలుడు. తను రాజునన్న గర్వం ఏనాడూ ఉండేది కాదు ఆయనకు. ఇతర రాజ్యాలలో వున్న వ్యాపారస్తులంతా నాణ్యమైన సరుకు కోసం విశాల రాజ్యానికి వచ్చేవారు. అందువల్లకూడా, విశాలరాజ్యంలోని రైతులకు మంచి లాభాలు వచ్చేవి. ఆ ఉత్సాహంతో రైతులు ఇంకా నాణ్యమైన పంటలను పండించేవారు. ఆ విధంగా ఆ రాజ్యం నాణ్యమైన సరకులకు పెట్టిన పేరైంది.
కొన్నిసంవత్సరాల తరువాత ఆ రాజు ఆ రాజ్యంలోని రైతులందరినీ సమావేశపరిచి, "నేను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. రాజ్యం వదలి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను. ఈ రోజు సుదినం. సాయంత్రంగానే నేను ప్రయాణమై పోతాను. ఇన్నేళ్ళుగా మీరు తెలుసుకున్న మెళకువలతో మంచి మంచి పంటలు పండిస్తూ పోండి. మన రాజ్య కీర్తి ప్రతిష్టలను ఇంకా ఇనుమడింప జేయండి " అని ముగించాడు.
రైతులందరూ చాలా బాధపడ్డారు. రాజు మాటలకు ఎదురు చెప్పలేరాయె! విచారంగా ముఖాలు వేళ్ళాడ వేసుకొని ఇళ్ళకు చేరుకున్నారు. ఆ రోజు సాయంత్రం రాజుగారు అడవులకు వెళ్ళిపోతూ ఉంటే ఆ రాజ్యం లోని ప్రజలందరూ బాధపడి, ఏడుస్తూ చూస్తుండి పోయారు. అటు తరువాత కూడా ఆ రైతులు రాజుగారిచ్చిన విలువైన సలహాలను పాటిస్తూ మంచి నాణ్యమైన పంటలు పండించారు. గొప్ప లాభాలు పొందారు; ధనవంతులయ్యారు.
నిదానంగా వాళ్లంతా మంచి భవనాలు కట్టించుకుని విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయారు. రాజును పూర్తిగా మరచిపోయారు. పంటలు పండించడం మానుకున్నారు.

కొంత కాలానికి వారు పూర్తిగా సోమరులుగా తయారయ్యారు. వాళ్ళ దగ్గరున్న డబ్బులు మంచులాగా కరిగిపోతూ వచ్చాయి. వాళ్ళు ఇష్టపడి కట్టించుకున్న ఇండ్లు సైతం అమ్ముకోవలసి వచ్చింది. అయినా వాటిని కొనేవాళ్ళు కూడా లేరు! ధనవంతులు బికారులయ్యారు. ఆ రాజ్యంలో అంతటా కరువు తాండవం ఆడసాగింది. ప్రజలు ఆకలితో మాడుతున్నారు. అప్పుడు వాళ్లకు రాజుగారు గుర్తుకు వచ్చారు. అయినా ఏం లాభం? ఏమీ ప్రయోజనం లేకపోయింది.
రైతులు సోమరులుగా మారడంతో పంటలు పండించలేకపోయారు. వర్షాలు కూడా సరిగా పడటం లేదు. కొంత కాలానికి రాజుగారు రాజ్యానికి తిరిగి వచ్చారు. రాజ్య స్థితిగతులను చూసారు. అక్కడ ఒక క్షణం కూడా ఉండలేక, తిరిగి అడవులకు వెళ్ళిపోయారు.
'విశాల హృదయాలు లేని విశాల రాజ్యం నాకెందుకు?' అని రాజుగారికి అనిపించి ఉంటుంది.

Comments

Popular posts from this blog

కాకి దాహం....

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది. చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు. కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది. నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది. . . . “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక స్ట్రా వెతికి తాగేది”.

సింహము-ఎలుక

సింహము-ఎలుక అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది.  కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది. “నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది.  ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి. కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరిక...

కోపం వచ్చిన కోతులు

అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. వృక్షం వాటికి గాలి, చలి, యెండా తగలకుండా కాపాడేది. ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడ గడ వణుకుతున్నయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము, మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసాయి. ఆకులను కొమ్మలను విరిచేసి ఛల్లా ఛెదురు చేసాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో యేడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి. రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి, అయ్యో అనుకున్నయి పక్షులన్ని. అనవసరంగా మనకు సంబంధంలేని విశయంలో తలదూర్చామని పశ్చ్యాతాప పడ్డాయి.